Mon Dec 23 2024 08:02:00 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా టీచర్ ను వేధించాడు.. ఆరు నిమిషాల్లో
మహిళా టీచర్ ను వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఆట కట్టించారు దిశ పోలీసులు
మహిళా టీచర్ ను వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఆట కట్టించారు దిశ పోలీసులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒంగోలు లోని ఓ ప్రవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న మహిళను గత కొన్ని రోజులుగా చంద్ర శేఖర్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. గతంలో మహిళా టీచర్ తో కలిసి చంద్రశేఖర్ పని చేసిన సమయంలో తీసుకున్న ఫోటోలను, కాల్ రికార్డ్ లను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె తన భర్త కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ భయపడలేదు.
ఈ సోమవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న మహిళను మరోసారి చంద్రశేఖర్ వేధించాడు. దీంతో విసుగెత్తిపోయిన బాధితురాలు 'దిశ SOS' కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. మహిళా టీచర్ ఉంటున్న లొకేషన్ కు దిశ పోలీసులు కేవలం ఆరు నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. మహిళ వెంటపడి వేధిస్తున్న చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రశేఖర్ ఫోన్ లో ఉన్న మార్ఫింగ్ ఫోటోలను, అసభ్యకరమైన సందేశాలను పోలీసులు సేకరించారు. బాధిత మహిళా టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ పై ఐపీసీ 354 D, 506, 509 సెక్షన్ల కింద ఒంగోలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story