మరో నవవధువు ఆత్మహత్య.. ఇష్టంలేని పెళ్లే కారణమా ?
సుృజన మృతి కేసు మిస్టరీ వీడకుండానే.. తెలంగాణలో మరో నవవధువు కాళ్లపారాణి ఆరకుండానే మృత్యు ఒడికి చేరింది.
మహబూబ్ నగర్ : విశాఖ మధురవాడలో నవవధువు సుృజన పెళ్లిపీటలపైనే మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సృజన మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. బుధవారం రాత్రి సృజన మృతి చెందగా.. మూడ్రోజులైన ఆమె మృతికి గల కారణాలేంటో ఇంతవరకూ తెలియరాలేదు. సుృజన తల్లిదండ్రులు.. పెళ్లికొడుకు తరపు వారంతా ఆమె ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్తున్నారు. కానీ.. వైద్యులు ఆమె బాడీలో విషపదార్థ అవశేషాలున్నట్లు చెప్తున్నారు. సుృజన మృతి కేసు మిస్టరీ వీడకుండానే.. తెలంగాణలో మరో నవవధువు కాళ్లపారాణి ఆరకుండానే మృత్యు ఒడికి చేరింది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మి(19) 10వ తరగతి వరకూ చదువుకుంది. ఆ తర్వాత చదువు మానేసి ఇంటికే పరిమితమైంది. ముగ్గురు కూతుర్లున్న ఆ తల్లి.. పెద్దకూతురికి పెళ్లి చేసి పంపాలనుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్ తో మే 12వ తేదీన పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం డీజే పాటలకు నవ దంపతులు కలిసి స్టెప్పులేశారు. కానీ.. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఉదయం 9 గంటలకు పెళ్లైంది. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేసింది లక్ష్మి. సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు.. తనకు ఇష్టంలేని పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారన్న బాధతో లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తల్లి పద్మ చెప్పారు. లక్ష్మి మృతితో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.