Mon Dec 23 2024 12:03:43 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య
ఇప్పుడు మరో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో.. దీని వెనుక చదువు ఒత్తిడి లేదా ర్యాగింగ్ వంటిదేమైనా..
నిజామాబాద్ లో మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోన్న సనత్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. అందుకు గల కారణాలు మాత్రం తెలియలేదు. సనత్ స్వస్థలం పెద్దపల్లి. కాలేజీ యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సనత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు.
గత నెల 25న ఇదే హాస్టల్ లో హర్ష అనే వైద్య విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే.. అతను ఏవో కుటుంబ సమస్యల కారణంగా అలా చేశాడని పేర్కొన్నారు. ఇప్పుడు మరో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో.. దీని వెనుక చదువు ఒత్తిడి లేదా ర్యాగింగ్ వంటిదేమైనా ఉందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. రేపటి నుంచి కాలేజీలో ప్రాక్టికల్స్ జరగనున్న నేపథ్యంలో సనత్ ఆత్మహత్య సంచలనంగా మారింది. సనత్ తన తోటి విద్యార్థులతో ఎంతో స్నేహంగా ఉంటాడని, అలాంటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంపై కాలేజీ ప్రిన్సిపల్ ఇందిర విచారం వ్యక్తం చేశారు.
Next Story