Sun Dec 22 2024 16:20:27 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాగింగ్ భూతానికి వరంగల్ లో మరో విద్యార్థిని బలి
ఈ నేపథ్యంలో రక్షిత మరొకరితో కలిసి ఉన్న ఫొటోలను సీనియర్ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమెను వేధింపులకు..
ర్యాగింగ్, సీనియర్ల వేధింపులకు మెడికో ప్రీతి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. అంతలోనే వరంగల్ జిల్లాలోనే మరో విద్యార్థినినీ ర్యాగింగ్ భూతం బలితీసుకుంది. సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక.. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయముఖి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో రక్షిత మరొకరితో కలిసి ఉన్న ఫొటోలను సీనియర్ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆమెను వేధింపులకు గురిచేశాడు. దాంతో మనస్తాపానికి గురైన రక్షిత వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు. రెండ్రోజుల క్రితమే భూపాలపల్లిలో రక్షిత కనిపించడంలేదంటూ.. ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంతలోనే కూతురు ఇక లేదని తెలిసి వారి రోదనలు మిన్నంటాయి.
Next Story