Mon Dec 23 2024 18:44:46 GMT+0000 (Coordinated Universal Time)
APSRTC : ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజ్ సమీపంలో గరుడ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న..
ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన గరుడ బస్సు బోల్తా పడింది. మంగళవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజ్ సమీపంలో గరుడ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ 16 జడ్ 0599 నెంబర్ గల బస్సు విజయవాడ నుంచి మియాపూర్ (హైదరాబాద్) వెళ్తుండగా, చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి హెడ్ లైట్లలో సమస్య తలెత్తింది.
దాంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ బస్సును నియంత్రించేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రయత్నం ఫలిచలేదు. బస్సు ఒక పక్కకు ఒరుగుతూ బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు స్పందించి, బస్సు అద్దాలను పగులగొట్టారు. అందులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరు ప్రయాణికులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్ తరలించారు.
Next Story