Mon Dec 23 2024 03:33:15 GMT+0000 (Coordinated Universal Time)
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
రూమ్ మేట్స్ భోజనం చేయాలని అడగ్గా.. తర్వాత తింటానని చెప్పింది. రక్షిత గదిలోకి వెళ్లి అరగంట దాటినా బయటకు రాకపోవడంతో..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న గోలి రక్షిత పట్టణంలోని ఎస్సీ ఉమెన్స్ హాస్టల్ లో బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. మెండోరా మండల కేంద్రానికి చెందిన రక్షిత.. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఉంటూ రోజూ కాలేజీకి వెళ్తోంది. యధావిధిగా కాలేజీ నుంచి తిరిగొచ్చిన రక్షిత రాత్రి అందరితో కలిసి భోజనం చేయకుండా.. తన గదిలోకి వెళ్లింది.
రూమ్ మేట్స్ భోజనం చేయాలని అడగ్గా.. తర్వాత తింటానని చెప్పింది. రక్షిత గదిలోకి వెళ్లి అరగంట దాటినా బయటకు రాకపోవడంతో.. ఆమెకు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసిన స్పందించకపోవడంతో వార్డెన్ ఫర్జానా బేగం కిటికీలో నుంచి చూడగా.. ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. తలుపులు పగలగొట్టి రక్షితను కిందికి దించి ఆర్మూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. అక్కడికి తరలించారు. రక్షితను పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే మరణించిందని ధృవీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, రక్షిత ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
Next Story