Mon Dec 23 2024 07:23:59 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. ఫేస్ బుక్ లైవ్ లో యువకుడి ఆత్మహత్య
తన కుటుంబాన్ని కాదని ఈ పని చేయలేనని చెప్పడంతో.. జయదీప్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఫేస్ బుక్ లైవ్..
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఫేస్ బుక్ లైవ్ లో ఉరేసుకున్నాడు. అసోంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కలాయిన్ కు చెందిన జయదీప్.. సిల్చార్ లో ఓ గదిలో అద్దెకు ఉంటూ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా జయదీప్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో.. ఆమెను కుటుంబ సభ్యులు బలవంతంగా జయదీప్ కు దూరంగా ఉంచారు.
ఈ క్రమంలో జయదీప్ ఆమెను పెళ్లిచేసుకుందామని అడగ్గా.. యువతి అందుకు నిరాకరించింది. తన కుటుంబాన్ని కాదని ఈ పని చేయలేనని చెప్పడంతో.. జయదీప్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ.. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడిగితే.. అందరిముందు తన ప్రపోజల్ ను తిరస్కరించిందని, ఆ తర్వాత వాళ్ల అంకుల్ వచ్చి ఆమెను మర్చిపోకుంటే చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. అంకుల్, ఆంటీ, అక్క, తమ్ముడు, బావ.. మీ అందరినీ ఎంతగానో ప్రేమించాను. మీ కంటే ఎక్కువగా నా ప్రేయసిని ప్రేమించాను. ఆమె లేని జీవితాన్ని ఊహించలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూనే.. జయదీప్ లైవ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా.. సదరు యువతి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే జయదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు రూపమ్ రే పోలీసులకు తెలిపాడు. జయదీప్ తమ కుటుంబాన్నంతటినీ పోషిస్తున్నాడని, అతని సంపాదన కూడా బాగుందని, అతనికిచ్చి పెళ్లిచేసేందుకు యువతి కుటుంబ సభ్యులకు వచ్చిన ఇబ్బంది ఏంటో తమకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. జయదీప్ కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు.. లైవ్, మౌఖిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story