Mon Dec 23 2024 00:27:54 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ఆర్కే బీచ్ లో దారుణం.. మిస్టీరియస్ డెత్ గా యువతి మిస్సింగ్ కేసు
ఏప్రిల్ 25 సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన స్వాతి.. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని..
విశాఖ ఆర్కే బీచ్ లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. సముద్ర తీరాన యువతి మృతదేహం లభ్యమైన తీరు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. అర్థనగ్నంగా యువతి మృతదేహం కనిపించడంతో.. ఇది ఎవరైనా చేసిన హత్యా ? యువతిపై అఘాయిత్యం చేసి ఉంటారా ? లేక యువతే ఆత్మహత్య చేసుకుందా ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతురాలు గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. ఏప్రిల్ 25 సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన స్వాతి.. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కే బీచ్ లో శవమై కనిపించడంతో.. మిస్టీరియస్ డెత్ కేసుగా మారింది. ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతో ఎవరో స్వాతిని చంపేసి.. తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా.. మృతురాలికి పెళ్లై ఏడాది అవగా.. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ అని తెలుస్తోంది. స్వాతి మిస్సింగ్ కు ముందు ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. పోలీసులు స్వాతి సన్నిహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
Next Story