Mon Dec 23 2024 10:27:34 GMT+0000 (Coordinated Universal Time)
అమ్మో ఆంటీ.. ఏంటీ షాకింగ్ ట్విస్టులు
ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.
వాయిస్ విని.. సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఎవరిని పడితే వారిని నమ్మకూడదు.. ఆ ముఖాలు, వాయిస్ ల వెనుక ఎవరు ఉంటారో.. ఎంతటి దారుణాలకు ఒడిగడతారో అసలు ఊహించలేము. తాజాగా ఓ ఆంటీ ఉదంతం అందరికీ షాకింగ్ గా నిలిచింది. అమ్మాయిగా నమ్మించి మోసాలకు పాల్పడింది. ఫేస్బుక్లో అందమైన యువతి ఫొటో పెట్టి యువకుడిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన 50 ఏళ్ల మహిళ పెళ్లి ఖర్చుల కోసం అతడి నుంచి మూడున్నర లక్షలు కొట్టేసింది. తన పిన్నమ్మను పంపిస్తున్నానంటూ ఆమే అతడి వద్దకు వచ్చి డబ్బులు తీసుకెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ తాలూకాలో జరిగింది.
ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని యువకుడు భావించాడు. ఆమెను కలవాలని అతడు చాలాసార్లు ప్రయత్నించాడు. ఆమె ఏదో ఒక కారణం చెప్పి తప్పిన్చుకున్తూ వచ్చింది. ఆమెను కలిసే ప్రయత్నాన్ని విరమించుకుని ఆమెను పెళ్లి చేసుకుంటే చాలనే నిర్ణయానికి వచ్చాడు. యువకుడు పెళ్లి ప్రపోజల్ తీసుకుని రావడంతో ఆమె కూడా ఒప్పుకుంది. మాట్లాడేందుకు తన పినతల్లిని పంపుతున్నట్టు చెప్పింది.
ఆమె పినతల్లి వారింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా మాట్లాడింది. పెళ్లికి వారు అంగీకరించడంతో తమవైపు కూడా రెడీ అని చెప్పింది. ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు ఆమె చేతిలో రూ. 3.50 లక్షలు ఇచ్చాడు. పెళ్లి కూడా ఖరారైంది. ఆదిచుంచనగరి మఠంలో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి వచ్చిన యువతి 'పినతల్లి' పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె ఫేస్బుక్లో యువకుడికి పరిచయమైన యువతి ఈ 'పిన్నమ్మే'నని తెలిసి అవాక్కయారు. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని మోసం చేసినట్లు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న రూ. 3.50 లక్షలను వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించింది. ఈ ఫేస్ బుక్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పాపం ఆ యువకుడు అంటూ అందరూ జాలి చూపిస్తున్నారు. పిన్నమ్మా.. నువ్విచ్చిన ట్విస్టులే వేరమ్మా అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Next Story