Fri Nov 22 2024 16:58:55 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి
చిన్నకొడుకు హరికృష్ణ (18) స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం..
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోన్ యాప్ లలో తాను తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ సొమ్ము చెల్లించినా..ఇంకా డబ్బు చెల్లించాలని అసభ్య పదజాలంతో, ఫొటోలు, వీడియోలు పంపుతూ మానసికంగా హింసించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై హరికృష్ణ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వివరాలిలా ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన సురకాసుల శ్రీను కి కార్తీక్,హరికృష్ణ ఇద్దరు కుమారులున్నారు. శ్రీను టైలరింగ్ చేస్తూ కొడుకులను చదివిస్తున్నాడు. చిన్నకొడుకు హరికృష్ణ (18) స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం హరి ఈ ఏడాది జనవరి 28న కొన్ని లోన్ యాప్ ల నుండి లోన్ తీసుకున్నాడు. ఒక యాప్ తీసుకున్న లోన్ తీర్చేందుకు మరో యాప్ లో డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. మొత్తం రూ.1.50 లక్షలను యాప్ లకు చెల్లించాడు. తీసుకున్న సొమ్ముకంటే అధికమొత్తంలో తిరిగి చెల్లించినా.. ఇంకా చెల్లించాలని లేదంటే మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను తన స్నేహితులు, బంధువులకు పంపుతామని దారుణంగా వేధించారు.
ఈ క్రమంలో హరికృష్ణ పోలీసులను ఆశ్రయించగా.. లోన్ యాప్ నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న నిర్వాహకులు మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హరి తన ఇంట్లో చీరతో ఫ్యాన్ కు హ్యాంగ్ చేసుకున్నాడు. హరికృష్ణ అన్నయ్య కార్తీక్ ఇంటికి వచ్చేసరికి హరి విగతజీవిగా కనిపించడంతో షాకయ్యాడు. అతని మొబైల్ ను తనిఖీ చేయగా.. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల మెసేజ్ లు వాట్సాప్ లో కనిపించాయి. హరికృష్ణ మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని హరి తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story