Mon Dec 23 2024 14:28:48 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే అమ్మాయిని ప్రేమించిన స్నేహితులు.. చివరికిలా జరిగింది
హరికృష్ణ, నవీన్ ల పరిచయం స్నేహంగా మారింది. అయితే వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. దాంతో ఇద్దరికీ..
తాను ప్రేమిస్తున్న యువతితో.. తన స్నేహితుడు కూడా చనువుగా ఉంటుండటాన్ని తట్టుకోలేక ఓ యువకుడు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. హరికృష్ణ అనే యువకుడు ఈ నెల 17వ తేదీన తన స్నేహితుడైన నవీన్ ను హత్య చేసి అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని గుట్టల్లో పడేశాడు. నవీన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించగా.. నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగర్ కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (20) నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరికృష్ణ, నవీన్ ల పరిచయం స్నేహంగా మారింది. అయితే వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. దాంతో ఇద్దరికీ బేధాభ్రిపాయాలు ఏర్పడ్డాయి. తాను ప్రేమించిన యువతినే నవీన్ ప్రేమించడాన్ని తట్టుకోలేకపోయిన హరి.. ఎలాగైనా అతడిని మట్టుపెట్టాలని భావించాడు.
ఫిబ్రవరి 17న ఉదయం పార్టీ చేసుకుందాం రమ్మని తన స్నేహితుడి రూమ్ కు నేనావత్ నవీన్ ను ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన నవీన్ తో హరి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఈ విషయాన్ని నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి చెప్పగా.. శంకరయ్య హరితో మాట్లాడి.. గొడవను పరిష్కరించారు. ఆ తర్వాత నాలుగురోజుల వరకూ నవీన్ అటు కాలేజీకి, ఇటు ఇంటికీ వెళ్లకపోవడంతో.. తండ్రి శంకరయ్య 22వ తేదీన నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు.
ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం నుంచి హరికృష్ణ ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉండటంతో.. పోలీసులు అతని తల్లిదండ్రులను పిలిపించారు. కుటుంబసభ్యులు, పోలీసులు, తన స్నేహితుల నుండి నవీన్ ఆచూకీ కోసం ఒత్తిడి పెరగడంతో.. శుక్రవారం (ఫిబ్రవరి 24) రాత్రి హరికృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయి, నవీన్ ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హరికృష్ణకు ఎవరు సహకరించారు ? నవీన్ ను ఎలా హత్య చేశాడు ? అనే విషయాలపై హరికృష్ణను విచారణ చేస్తున్నారు.
Next Story