నాలుగో అంతస్తు నుండి కుమార్తెను కిందకు తోసేసిన తల్లి.. ఎందుకిలా చేసిందంటే..!
అపార్ట్మెంట్లోని 4వ అంతస్తు కారిడార్‌లో తల్లి బిడ్డతో కలిసి నడుస్తూ కనిపించింది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే కర్కశంగా ప్రవర్తించింది. మానసిక వికాలాంగురాలైన కుమార్తెను నాలుగో అంతస్తు నుండి కిందకు పడేసింది. బెంగళూరులోని తమ అపార్ట్మెంట్లోని 4వ అంతస్తు నుంచి ఓ తల్లి తన ఐదేళ్ల కుమార్తెను తోసేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. ఆ కుమార్తె దివ్యాంగురాలని.. తల్లి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో, అపార్ట్మెంట్లోని 4వ అంతస్తు కారిడార్‌లో తల్లి బిడ్డతో కలిసి నడుస్తూ కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా పాపను కిందకు పడేసింది. ఆగస్టు 4వ తేదీ గురువారం ఈ ఘటన జరిగింది. తన బిడ్డను విసిరిన తర్వాత, తల్లి కూడా అక్కడి రైలింగ్‌పైకి ఎక్కబోయింది. కొన్ని సెకన్ల తర్వాత, సమీపంలోని వ్యక్తులు ఆమెను కిందకు లాగారు. సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 'తల్లి కావాలనే బాల్కనీ నుంచి చిన్నారిని తోసేసింది. ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశాం. ఆ పాప మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మేము తదుపరి పరిశోధనలు నిర్వహిస్తున్నాం.' అని అన్నారు.