Mon Dec 23 2024 07:40:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆరేళ్ల ప్రేమ ఆరు నిమిషాల్లో ఆవిరి.. వాట్సాప్ మెసేజ్ లు చూపించలేదని దారుణం
ముఖం కడుక్కుని వస్తానని బాత్రూంకు వెళ్లిన నవ్య.. లోపల వాట్సాప్ చాట్ చేస్తూ ఉండిపోయింది. దీంతో మండిపడ్డ ప్రశాంత్..
వాళ్లిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఇళ్లలో పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 14) ప్రేయసి పుట్టినరోజును ఘనంగా చేసిన అతను.. ఆమె కేక్ ను కట్ చేసిన కత్తితోనే గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ దారుణ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన నవ్య- ప్రశాంత్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. అయినా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. శుక్రవారం నవ్య బర్త్ డేను ఇద్దరూ ఘనంగా జరుపుకున్నారు. నవ్య, ప్రశాంత్ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇంతలో నవ్యకు ఓ కాల్ వచ్చింది. కాసేపు మాట్లాడి పెట్టేశాక వాట్సాప్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరితో ఇంతసేపు చాట్ చేస్తున్నావ్ అని ప్రశాంత్ అడిగినా చెప్పలేదు.
ముఖం కడుక్కుని వస్తానని బాత్రూంకు వెళ్లిన నవ్య.. లోపల వాట్సాప్ చాట్ చేస్తూ ఉండిపోయింది. దీంతో మండిపడ్డ ప్రశాంత్.. చాట్ వివరాలు చూపెట్టాలని నిలదీశాడు. వాట్సాప్ లో చాటింగ్ తన వ్యక్తిగత అంశమని, అది చూపించేది లేదని నవ్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. కోపంతో ఊగిపోయిన ప్రశాంత్ కేక్ కోసిన కత్తితో నవ్యపై దాడి చేశాడు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో నవ్య అక్కడికక్కడే చనిపోయింది. గంటల తరబడి మృతదేహం పక్కనే కూర్చున్న ప్రశాంత్.. తొలుత శవాన్ని మాయం చేయాలని భావించాడు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకుని నేరుగా రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి.. జరిగిందంతా పోలీసులకు వివరించాడు. తన ప్రియురాలిని చంపేశానంటూ కత్తిని పోలీసులకు అప్పగించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న నవ్య డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించారు.
Next Story