Sat Nov 23 2024 04:13:56 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్రలో విషాదం.. కూలిన బతుకులు
శిథిలాల నుంచి సహాయక సిబ్బంది 12 మందిని రక్షించారు. మృతులు నవనాథ్ సావంత్ (40), లక్ష్మీదేవి రవి మటో (26)
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మరణించారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లా భివాండి ప్రాంతంలోని ఓ మూడంతస్తుల పాత భవనం శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో కింది అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.
శిథిలాల నుంచి సహాయక సిబ్బంది 12 మందిని రక్షించారు. మృతులు నవనాథ్ సావంత్ (40), లక్ష్మీదేవి రవి మటో (26), సోనా ముఖేష్ కోరి (5)లుగా గుర్తించారు. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంత్రి కపిల్ పాటిల్, థానే కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను భివాండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అందుకు తగిన ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
Next Story