Tue Nov 26 2024 08:01:40 GMT+0000 (Coordinated Universal Time)
పేరు పిలిచారు.. ఉదయం 5:30 గంటలకు తలుపు తీయగానే
సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
బీహార్‌లోని అరారియా జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు చంపేశారు. శుక్రవారం ఉదయం అతని ఇంటి వద్ద కాల్చి చంపినట్లు బీహార్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాణిగంజ్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిని విచారకరమైన సంఘటనగా అభివర్ణించారు. వార్త విన్న వెంటనే, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. విమల్ కుమార్ యాదవ్ అనే 35 ఏళ్ల బాధితుడు 'దైనిక్ జాగరణ్' వార్తాపత్రికలో స్థానిక జర్నలిస్టుగా పనిచేశాడని పోలీసులు తెలిపారు. దుండగులు ఉదయం 5:30 గంటలకు ఇంటికి వెళ్లారని.. అతను తలుపు తెరిచినప్పుడు అతని ఛాతీపై కాల్చారని తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. విచారణ మొదలుపెట్టారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.హత్యా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించామని అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రెండేళ్ల క్రితం విమల్ తమ్ముడు, సర్పంచ్ గా ఉన్న కుమార్ శశిభూషణ్ అలియాస్ గబ్బు కూడా ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విమల్ కుమార్ యాదవ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడని, ఆ హత్యకు సంబంధించిన వ్యక్తులే ఇది కూడా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాక్ష్యం చెప్పవద్దని హెచ్చరిస్తూ విమల్ ను చాలాసార్లు బెదిరించారు. ఈ రెండు హత్యల మధ్య సంబంధముందని యాదవ్ కుటుంబం ఆరోపించడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. విమల్ కుమార్ యాదవ్‌కు 15 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
Next Story