Fri Nov 22 2024 21:44:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ కొనడంతో దొరికిపోయిన ఏడుకోట్ల నగల దొంగ
తాజాగా ఆ దొంగ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. అతను ఎత్తుకెళ్లిన నగలను భూమిలో పాతిపెట్టగా..
హైదరాబాద్ లో ఇటీవల ఓ కారు డ్రైవర్ ఏడుకోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో పరారైన ఘటన కలకలం రేపింది. తాజాగా ఆ దొంగ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. అతను ఎత్తుకెళ్లిన నగలను భూమిలో పాతిపెట్టగా.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మాదాపూర్ లో నివసించే రాధిక అనే మహిళ నగల వ్యాపారం చేస్తుంటుంది. ఆమె వద్ద శ్రీనివాస్ (28) కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న ఓ కస్టమర్ కు నగ చూపించేందుకు వెళ్లగా.. కారులో ఉన్న ఏడుకోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో శ్రీనివాస్ పరారయ్యాడు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా.. నిందితుడి కోసం పోలీసులు గాలించారు.
నగలతో కూకట్ పల్లి చేరుకున్న శ్రీనివాస్.. కారును వదిలేసి నర్సంపేటలోని తన బంధువు వద్దకు వెళ్లాడు. కారులో పెట్రోలు కోసం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్కార్డుతో ఫోన్ కొనుగోలు చేసిన శ్రీనివాస్, దానిని అతడి బంధువుకి ఇచ్చి అతడి ఫోన్ను తీసుకున్నాడు. అనంతరం బస్సులో తన సొంతూరైన తూ.గో.జిల్లా కొవ్వూరుకు వెళ్లి.. రహస్యంగా గొయ్యితీసి నగలను భూమిలో పాతిపెట్టాడు. రాధిక ఇచ్చిన డెబిట్కార్డుతో ఫోన్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా పోలీసులు శ్రీనివాస్ బంధువుని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతని ఆచూకీ తెలిసింది.
కొవ్వూరుకు వెళ్లిన పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. నగల గురించి ప్రశ్నించగా.. భూమిలో పాతిపెట్టినట్లు తెలిపాడు. భూమిలో పాతిపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత మీడియా ఎదుట హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. కాగా.. 7 కోట్ల రూపాయల నగలకు సంబంధించిన బిల్లులు, లెక్కలు లేకపోవడంతో ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు.
Next Story