Fri Dec 20 2024 19:34:04 GMT+0000 (Coordinated Universal Time)
పూణేలో డ్రగ్స్ కలకలం.. తెలంగాణకు లింక్స్?
మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది
మహారాష్ట్రలోని పూణేలో తెలంగాణ వాసులు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. పూణేలో ఐదుగురి వద్ద రూ.51 కోట్ల విలువ చేసే 101 కేజీల మెథాక్వాలోన్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ - పుణే జాతీయ రహదారిపై డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను డీఆర్ఐ బృందం పట్టుకుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఎక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొని వస్తున్నారని దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్‌ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిఘా ఆధారంగా ఆగస్ట్ 22న పూణెలో తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారును డీఆర్ఐ బృందం అడ్డగించింది. ఆ వాహనాన్ని పరిశీలించగా అందులో తెల్లటి స్ఫటికాకార పదార్థంతో నిండిన నాలుగు నీలం రంగు ప్లాస్టిక్ కంటైనర్లు కనిపించాయి. ప్రాథమిక పరీక్షల్లో అది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) అని.. నిబంధనల ప్రకారం నిషేధించబడిన మెథాక్వాలోన్ అని తేలింది. ఈ క్రమంలోనే ఆ వాహనంతో పాటు 101.31 కిలోగ్రాముల మెథాక్వలోన్గా భావిస్తున్న పదార్థాన్ని ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ. 50.65 కోట్లు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ డ్రగ్స్ కార్టెల్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Next Story