Mon Nov 18 2024 03:41:51 GMT+0000 (Coordinated Universal Time)
యూపీ గ్యాంగ్ రేప్ లో ఊహించని ట్విస్ట్.. ఆస్తి కోసం మహిళ ఆడిన డ్రామా
ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురిని ఘజియాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది రోజుల తర్వాత, ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మహిళ చేసిన ఆరోపణలను పోలీసులు గురువారం తోసిపుచ్చారు. మహిళ, నిందితులకు ఆస్తిపై వివాదం నడుస్తోందని.. అందులో భాగంగా మొత్తం కుట్ర జరిగిందని చెప్పారు. ఈ పథకంలో మహిళకు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేశామని, ఆమెపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మీరట్ రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ ఈ రోజు మాట్లాడుతూ, "ఆస్తి వివాదంలో నిందితుడిని ఇరికించేందుకు ఆజాద్ అనే వ్యక్తితో కలిసి మహిళ కట్టుకథను అల్లింది. పోలీసులు ఆజాద్, రాజు, అతని సహచరులు గౌరవ్, అఫ్జల్‌లను అరెస్టు చేశారు. కుట్రకు ఉపయోగించిన ఆల్టో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు." అని తెలిపారు. ఈ ఫిర్యాదు మొత్తం ఐదుగురిపై అత్యాచారం కేసు నమోదు చేయడానికి పన్నిన కుట్ర అని పోలీసు అధికారి తెలిపారు.
అక్టోబరు 18న ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఘజియాబాద్‌లోని ఆశ్రమ రహదారికి సమీపంలో పడి ఉండటంతో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి ఫిర్యాదు నమోదు చేశారు. మహిళను బ్యాగ్‌లో ఉంచి చేతులు, కాళ్లు కట్టివేసి, ఆమె ప్రైవేట్ పార్ట్‌లలో ఇనుప రాడ్‌ని ఉంచినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. నిందితులుగా చెబుతూ.. నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. విచారణలో ఆస్తి వివాదం కోణాన్ని కూడా ప్రస్తావించారు.
వైద్య పరీక్షలు చేయించుకోడానికి నిరాకరించిన మహిళ:
పోలీసు అధికారులు మాట్లాడుతూ, "ఈ సంఘటన గురించి ఉత్తర ప్రదేశ్ పోలీసులకు సమాచారం అందగా.. మహిళను మొదట ఘజియాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించింది. ఆమె మీరట్‌లోని ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించుకోలేదు. చివరికి మహిళను ఢిల్లీలోని GTB ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో మహిళకు తెలిసిన ఆజాద్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. ఆమెను ప్రశ్నించగా, మహిళ నిందితులతో ఆస్తి వివాదంలో ఉందని, దీంతో కుట్ర పన్నారు" అని తెలిపారు
ఘజియాబాద్‌లో జరిగిన బర్త్‌డే పార్టీకి హాజరైన తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా కిడ్నాప్‌కు గురైనట్లు ఆ మహిళ పోలీసులకు చెప్పింది. తన సోదరుడు తనను బస్టాండ్‌లో దించాడని, అక్కడ నుంచి తనకు తెలిసిన ఐదుగురు వ్యక్తులు కారులో తనను లాగి బంధించి అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది.
Next Story