Mon Dec 23 2024 03:58:23 GMT+0000 (Coordinated Universal Time)
హెడ్ కానిస్టేబుల్ తో గొడవ.. తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్
దాంతో సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయిన పురుషోత్తమ్ సింగ్ వెంటనే తన వద్దఉన్న రైఫిల్ తో హెడ్ కానిస్టేబుల్ ను కాల్చాడు.
హెడ్ కానిస్టేబుల్ తో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన ఓ కానిస్టేబుల్ అతడిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో జరిగింది. భానుప్రతాప్పూర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 5న ఉపఎన్నిక జరిగింది. డిసెంబరు 8న ఓట్లను లెక్కించారు. అనంతరం మరో 45 రోజులపాటు ఈవీఎంలను భద్రపరిచేందుకు.. కాంకర్ లోని ప్రభుత్వ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి భద్ర పరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద చత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 11వ బెటాలియన్ను మోహరించారు. అక్కడ భద్రతాదారులుగా ఉన్న కానిస్టేబుల్ పురుషోత్తమ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర భగత్ ల మధ్య ఓ విషయమై గొడవ జరిగింది.
దాంతో సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయిన పురుషోత్తమ్ సింగ్ వెంటనే తన వద్దఉన్న రైఫిల్ తో హెడ్ కానిస్టేబుల్ ను కాల్చాడు. బుల్లెట్ హెడ్ కానిస్టేబుల్ తలలో నుండి దూసుకెళ్లడంతో.. సురేంద్ర భగత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భయంతో పురుషోత్తమ్ ఓ గదిలోకి వెళ్లి.. తనను తాను బంధించుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు గదిలో ఉన్న పురుషోత్తమ్ కు నచ్చజెప్పి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు.
Next Story