Fri Nov 22 2024 07:49:37 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కామర్స్ సైట్స్ లో మనం కొనే కత్తుల వెనుక ఇన్ని దారుణాలు ఉన్నాయా..?
భారత్ లో చైనా కత్తుల స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టు..!
ఢిల్లీ పోలీసులు ఇండో-చైనీస్ కత్తుల స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించారు. 14,053 బటన్-యాక్చువేటెడ్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చైనా నుండి ఇలాంటి కత్తులను అక్రమంగా దిగుమతి చేసి.. ఈ-కామర్స్ వెబ్సైట్లలో విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న, రోడ్డుపై పడి ఉన్న కొరియర్ ప్యాకేజీకి సంబంధించి పోలీసులకు కాల్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా డెలివరీ బాయ్ బైక్ నుంచి పెట్టె పడిపోయినట్లు తేలింది. కత్తి ఎవరు పంపారు.. అనే వివరాలు ప్యాకెట్ పై ఉంది. మాల్వియా నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాహిల్ కు దీంతో లింక్ ఉందనే సమాచారం పోలీసులకు అందింది. అతని గోదాముపై దాడి నిర్వహించారు. 28 సంవత్సరాల సాహిల్ అతని దగ్గర పని చేస్తున్న వాసిమ్ (18) పట్టుబడ్డారు. సాహిల్ ఆన్లైన్లో కత్తులను విక్రయించేవాడు. సదర్ బజార్‌లోని ఆశిష్ చావ్లా (43) నుంచి కత్తులను కొనుగోలు చేసి సాహిల్ గోదాముకు తరలించేందుకు యూసుఫ్ (29) అతనికి సహాయం చేశాడు.
యూసుఫ్, ఆశిష్ ఇద్దరినీ అరెస్టు చేశారు. సదర్ బజార్‌లోని అతని గోడౌన్ నుండి మరో 13,440 బటన్-యాక్చువేటెడ్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చావ్లా కత్తుల కోసం ఆర్డర్ ఇచ్చేవాడు. చైనాలో ఆఫీసు ఉన్న మయాంక్ బబ్బర్ (32) ఇక్కడికి దిగుమతి చేసుకుంటూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. బబ్బర్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇప్పటివరకు జరిపిన విచారణలో ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-మార్కెట్ ప్లాట్‌ఫారమ్ లలో ఇలాంటి అక్రమంగా తీసుకుని వచ్చిన కత్తులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్, రికవరీ కారణంగా పోలీసులు భారతదేశంలో విక్రయించడానికి నిషేధించబడిన బటన్ యాక్చువేటెడ్ కత్తులను చైనా నుండి పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్న ఇండో-చైనీస్ మాడ్యూల్‌ను ఛేదించారు.
Next Story