Mon Dec 23 2024 08:36:00 GMT+0000 (Coordinated Universal Time)
సంగారెడ్డిలో దారుణం.. కుటుంబం బలవన్మరణం
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక కలహం ఒక కుటుంబాన్ని మింగేసింది
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక కలహం ఒక కుటుంబాన్ని మింగేసింది. ఆర్థికంగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు వారి బలవన్మరణానికి కారణమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన మధుసూదన్ (38), లావణ్య (32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్ (6), సర్వజ్ఞ (3) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధుసూదన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యాపార రీత్యా వీరి కుటుంబం బీహెచ్ఈఎల్ లోని ఆర్సీపురంలో స్థిరపడ్డారు.
నష్టాలు రావడంతో....
అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న సమయంలో మధుసూదన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలొచ్చాయి. కుటుంబ పోషణ భారమైంది. భార్య భర్తల మధ్య ఆర్థిక కలహాలు మొదలయ్యాయి. కొంతకాలంగా ఇంట్లో ఇవే తగాదాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా మధుసూదన్ - లావణ్య ల మధ్య గొడవ జరగడంతో.. లావణ్య ఇద్దరి పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళిపోయింది.
ఉరివేసుకుని....
భార్య, పిల్లలు ఇంట్లో లేరన్న విషయం తెలుసుకున్న మధుసూదన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణవార్త తెలిసిన మరుక్షణం లావణ్య కూడా పిల్లలతో కలిసి అందోల్ పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
Next Story