Sat Dec 21 2024 14:56:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ లో జంట హత్యల కలకలం.. వివాహేతర సంబంధమా ?
గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులో యువతీ, యువకుడి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు..
ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతి, యువకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులో యువతీ, యువకుడి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు ఆదిలాబాద్లోని భుక్తాపూర్కు చెందిన రెహమాన్ (20), కేఆర్కే నగర్కు చెందిన 28 ఏళ్ల అశ్వినిగా గుర్తించారు.
అశ్వినికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త నుండి విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో రెహమాన్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. శుక్రవారం (ఏప్రిల్ 28) అశ్విని, రెహమాన్ లు ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలోని స్థానిక పంటపొలంలోకి బైక్ పై వెళ్తున్నట్లుగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. ఆ తర్వాతే వీరిద్దరూ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు రెహమాన్, అశ్విని లను తలపై బండరాయితో మోది హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అశ్విని తరపు బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అశ్విని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.
Next Story