Fri Nov 22 2024 20:39:42 GMT+0000 (Coordinated Universal Time)
కరెంట్ బిల్ కట్టలేదంటూ మెసేజ్.. లింక్ ఓపెన్ చేయగానే డబ్బు మాయం
కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్ కు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. 3 నెలల క్రితం కరెంట్ బిల్లు..
సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్త మెసేజ్ లలో వచ్చే లింక్స్ ను ఓపెన్ చేయొద్దని, ఎవరైనా బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ అకౌంట్ల వివరాలు అడిగితే చెప్పొద్దంటూ పోలీసులు పలుమార్లు హెచ్చరింస్తూ.. అవగాహన కల్పిస్తూ ఉన్నారు. కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం.. అంతకుమించిన సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా తెలంగాణలో కొత్తరకం సైబర్ మోసం వెలుగుచూసింది. కరెంట్ బిల్లు కట్టలేదంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపారు. బిల్లు కట్టడానికి అందులో ఓ లింక్ ఉంచారు. సదరు వ్యక్తి ఆ లింక్ ఓపెన్ చేయగానే.. అకౌంట్లో సొమ్ము కాజేశారు. వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన రాజేశ్వర్ కు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. 3 నెలల క్రితం కరెంట్ బిల్లు పెండింగ్ ఉందని, వెంటనే కట్టకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని తెలిపాడు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని హెచ్చరించాడు. దాంతో ఆందోళన చెందిన రాజేశ్వర్ పవర్ సప్లై ఆపొద్దని కోరాడు. అయితే ఓ లింక్ పంపుతాను.. దాని ద్వారా బిల్లు చెల్లించాలని సూచించాడు ఫోన్ చేసిన వ్యక్తి.
ఆ కేటుగాడు పంపిన లింక్ ను ఓపెన్ చేయగానే రాజేశ్వర్ ఖాతాలో నుంచి రూ.49 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వచ్చిన మెసేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు ఫోన్లు చేయరని తెలిపారు అధికారులు. బిల్లు కట్టని పక్షంలో నేరుగా ఇంటికే వచ్చి అడుగుతారని, బిల్లు చెల్లించకపోతే లైన్ మెన్ వచ్చి ఫీజు తీసుకుని వెళ్తాడని, పెండింగ్ బిల్లు కట్టాక విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాడని వివరించారు.
Next Story