దంపతుల మధ్య ఘర్షణ.. అల్లుడి కుటుంబంపై కత్తులతో దాడి
ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపినా.. ఎలాంటి మార్పు లేదు. గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే సోమవారం
సన్నగా మొదలైన వర్షం.. చిలికి చిలికి గాలి, వానగా పెరిగిన మాదిరిగానే భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ ప్రాణాలు తీసేంతవరకూ వెళ్లింది. దంపతుల మధ్య గొడవ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. భార్య తరపు కుటుంబీకులు, భర్త తరపు కుటుంబీకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఒక మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్కమంతల పహాడ్ లో చోటుచేసుకుంది.
ఐదేళ్ల క్రితమే వివాహం
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్క మంతల పహాడ్ కు చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడైన శివన్నారాయణకు.. అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ - యశోద దంపతుల కుమార్తె శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహమయింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా.. శివన్నారాయణ వృత్తిరీత్యా హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చిన అతను.. ప్రస్తుతం వారికున్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు.
పెళ్లైన నాటి నుంచే గొడవలు
ఇదిలా ఉండగా.. పెళ్లైన నాటి నుంచి ఆ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో పెద్ద మనుషులు సర్దిచెప్పి పంపినా.. ఎలాంటి మార్పు లేదు. గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మంగళవారం ఉదయం శ్యామల తన తల్లికి ఫోన్ చేసి జరిగిన గొడవ గురించి చెప్పి.. ఏడ్చింది. కూతురు ఏడుస్తుండటం భరించలేని సూర్యనారాయణ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన కూతుర్ని వేధిస్తున్న వాడిని వదిలిపెట్టనంటూ తల్లి, తల్లి, శ్యామల అన్న కలిసి శివన్నారాయణ ఇంటికెళ్లారు. తమతో తీసుకెళ్లిన కారాన్ని శివన్నారాయణ, అతని తండ్రి భిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, నానమ్మ కళ్లల్లో జల్లారు. అనంతరం కత్తులతో వారిపై దాడిచేశారు.
ఈ దాడిలో శివన్నారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందగా.. మిగతా వారంతా తీవ్రగాయాలతో మిర్యాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడి కుటుంబంపై దాడి చేసిన శ్యామల తల్లిదండ్రులు, అన్న స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లుతెలుస్తోంది.