Mon Dec 23 2024 16:35:09 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. 21 మంది మృతి
వేడుకల అనంతరం.. సంభవించిన అగ్నిప్రమాదం ఆ కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు..
పుట్టినరోజు వేడుకల్లో పెనువిషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వచ్చిన అగ్నిప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉండటం హృదయాలను ద్రవింపచేస్తోంది. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు అంతస్తుల భవనంలో అబు రయా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అదేరోజు ఈజిప్టు నుండి ఓ అతిథి కూడా వచ్చాడు.
వేడుకల అనంతరం.. సంభవించిన అగ్నిప్రమాదం ఆ కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదకరం. కాగా.. ప్రమాదానికి కారణం పెట్రోల్ అన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. ఇంట్లో ఫర్నిచర్ ఎక్కువగా ఉందని, మంటలు చెలరేగడానికి అవి కూడా ఒక కారణమై ఉంటుందని అన్నారు.
కాగా.. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల గాజాలో తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఇళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను నిల్వ చేసుకుంటున్నారు.
Next Story