Mon Dec 23 2024 06:18:19 GMT+0000 (Coordinated Universal Time)
లోయలో పడ్డ బస్సు.. 29 మంది దుర్మరణం
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ప్రయాణీకులతో వెళుతున్న బస్సు లోయలో పడడంతో
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ప్రయాణీకులతో వెళుతున్న బస్సు లోయలో పడడంతో 29 మంది మరణించారు. బస్సు పర్వత రహదారిపై నుండి లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు.. మరో 19 మంది గాయపడ్డారు. మెక్సికో సిటీ నుండి దక్షిణ ఒక్సాకా రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న బస్సు ఉదయం 6:30 గంటలకు మాగ్డలీనా పెనాస్కో పట్టణం సమీపంలో వెళుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయిందని భావిస్తున్నామని రాష్ట్ర అంతర్గత మంత్రి జీసస్ రొమెరో తెలిపారు. బస్సు ఘాట్ రోడ్డు నుంచి 80 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంపై ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ సాలోమన్ జారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం, గాయపడిన వారిలో కనీసం ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక రవాణా సంస్థ నిర్వహిస్తున్న బస్సు మంగళవారం రాత్రి రాజధాని మెక్సికో సిటీ నుండి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. బస్సును నడుపుతున్న కంపెనీ మెక్సికో సిటీ నుండి రోజువారీ సేవలను అందిస్తుందని తెలుస్తోంది. త్లాక్సియాకో పట్టణంలో 14 మందికి చికిత్స అందిస్తూ ఉండగా.. ఐదుగురిని రాష్ట్ర రాజధాని ఓక్సాకా సిటీకి విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు. వంకరగా, ఏటవాలుగా ఉన్న రోడ్లపై ఈ ప్రమాదం జరిగింది. ఏప్రిల్లో, పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో 18 మంది మరణించారు.
మెక్సికోలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం.. అధిక వేగం, వాహనాల కండీషన్ సరిగా లేకపోవడం, డ్రైవర్ల తప్పిదాల కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఆ దేశంలో చాలా మంది ప్రజలు బస్సులపై ఆధారపడతారు. దేశంలోని హైవేలపై కూడా ప్రమాదాలు బాగా పెరిగాయి. బుధవారం, సెంట్రల్ స్టేట్ క్వెరెటారోలోని హైవేపై కార్గో వాహనాలకు సంబంధించిన ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Next Story