Sun Dec 22 2024 21:10:10 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకొన్ని గంటల్లో పెళ్లి.. జిమ్ ట్రైనర్ ను సొంత తండ్రే చంపేశాడా?
29 ఏళ్ల జిమ్ ట్రైనర్ కి ఇంకొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందనగా
29 ఏళ్ల జిమ్ ట్రైనర్ కి ఇంకొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందనగా.. ఇంతలోనే దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని అతని ఇంటిలో దారుణంగా హత్య చేశారు. అతని ముఖం, ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచారు. ఈ హత్యలో మృతుడి తండ్రి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. బాధితుడు గౌరవ్ సింఘాల్ తమ్ముడిని, బంధువులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసిందని, ప్రధాన నిందితుడి అరెస్టు తర్వాత అంతా బయటపడే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ఈ ఘటనపై అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. దాడి తరువాత, సింఘాల్ కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చనిపోయినట్లు ధృవీకరించారు. సింఘాల్ వివాహ వేడుకలు గురువారం మొదలవ్వాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని డీసీపీ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. బాధితుడి ముఖం, ఛాతీపై 15కు పైగా కత్తిపోట్లు ఉన్నాయని.. అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కేసు తదుపరి విచారణ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Next Story