Sun Dec 22 2024 23:51:28 GMT+0000 (Coordinated Universal Time)
రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు, అమ్మాయి
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఊహించని ప్రమాదంలో
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఊహించని ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కున్న ఘటనలో 22 ఏళ్ల యువతి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే కారు ట్రక్కు వెనుక ఆగింది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత ట్రక్కు ముందుకు కదులుతుంది.. కారు కూడా వెళుతుందని అనుకున్నారు. కానీ ఇంతలో మరొక ట్రక్కు వెనుక నుండి వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల అమన్‌దీప్ కౌర్ మరణించింది.
రెడ్ లైట్ వద్ద రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కారు పూర్తిగా నలిగిపోయింది. కారుకు సంబంధించిన వీడియో చూస్తుంటేనే ఒళ్ళు ఝలదరిస్తోంది. హర్మీందర్ సింగ్ అనే కారు డ్రైవర్ తన అత్త, బంధువులతో కలిసి గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ నుండి తిమార్పూర్లోని నెహ్రూ విహార్‌కు ప్రయాణిస్తున్నాడు. అతని అత్త, బంధువుల అమ్మాయి అమన్‌దీప్ కౌర్ వెనుక సీటులో కూర్చున్నారు. మరొక బంధువు బంటి డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో అమన్‌దీప్ కౌర్, బంటీ ఇద్దరూ గాయపడగా.. ట్రామా సెంటర్‌కు తరలించారు. అమన్‌దీప్ కౌర్ చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఢిల్లీ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 337, 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద కేసు నమోదు చేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story