పాపం జేమ్స్.. కొరియర్ బాయ్ ప్రాణాలు ఇలా కూడా పోతాయా
రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది
గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టిన ఓ డెలివరీ బాయ్ నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్‌పై పడిపోయాడు. ఆ తరువాత లిఫ్ట్పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జేమ్స్(38) అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి మయూరీ నగర్లో నివాసం ఉంటున్నాడు. అతడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. అతడు ఓ పార్సిల్ డెలివరీని వెనక్కు తీసుకునేందుకు అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్‌కు వెళ్లాడు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్ నుంచి పార్సిల్ తీసుకుని తిరిగొస్తుండగా లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ఉంది. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అతడు లిఫ్ట్ పైకిరాని విషయాన్ని గమనించక లోపలికి కాలుపెట్టడంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంపై పడ్డాడు. ఆ తరువాత లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడు స్లాబ్‌కింద పడి నలిగి దుర్మరణం చెందాడు. లిఫ్ట్ మూడో అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్.. జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.