Mon Dec 23 2024 12:17:26 GMT+0000 (Coordinated Universal Time)
అంగన్వాడీ టీచర్ కు వేధింపులు.. దిశ యాప్ ను సంప్రదించగానే
గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపదలో ఉన్న మహిళలను దిశ యాప్ కాపాడుతున్న సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తాజాగా దిశ యాప్ తూర్పు గోదావరి జిల్లాలో అంగన్వాడి టీచర్ ను వేధించిన ఆగంతకుడిని కటకటాల పాలు చేసింది. నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని వెంకటకృష్ణ గా గుర్తించారు. వెంకటకృష్ణ పై 354 A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు రంగంపేట పోలీసులు.
దొంతమూరు గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. బాధిత మహిళ దిశ యాప్ కు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే దొంతమూరు గ్రామానికి దిశా పోలీసులు చేరుకున్నారు. బాధిత అంగన్వాడీ టీచర్ ఇచ్చిన వివరాల ప్రకారం విచారణ చేసిన పోలీసులు స్థానికంగా నివాసముండే వెంకటకృష్ణ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడినట్టు తెలుసుకున్నారు. అంగన్వాడి టీచర్, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట పోలీసులు వెంకటకృష్ణ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 A కింద వెంకటకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. దిశా పోలీసులు ధైర్యం చెప్పి భరోసా కల్పించారని బాధిత మహిళ తెలిపింది. నిందితునిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేశారని వివరించింది. అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్న సమయంలో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అనేకమందికి సూచించానని.. ఇప్పుడు తనకు అదే దిశ యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేసింది.
Next Story