Sat Nov 23 2024 03:39:29 GMT+0000 (Coordinated Universal Time)
ప్రీతి మృతి కేసు : నోరు విప్పిన సైఫ్, ఆ రూ.50 లక్షల బాండ్ ఏంటి ?
వైద్యవృత్తిలో భాగంగా పీజీ చదివే విద్యార్థులు ఫ్రీ సీటు పొందితే.. కళాశాల తరపున రూ.50 లక్షల బాండ్ పై సంతకం చేయాల్సి..
వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో పీజీ చదువుతోన్న వైద్య విద్యార్థిని ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాట్సాప్ చాట్ ను రిట్రీట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రీతికి ఈ పరిస్థితి రావడానికి కారణం సైఫ్ అని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా విచారణలో సైఫ్ తాను ప్రీతిని వేధించినట్లు అంగీకరించాడని సమాచారం. ప్రస్తుతం సైఫ్ పోలీసుల విచారణలో ఉన్నాడు. మొదట నాలుగు రోజుల వరకూ నోరు విప్పని సైఫ్.. ఇప్పుడు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. కొన్నివిషయాలు చెప్పినట్లు సమాచారం.
ఒక కేసు విషయంలో ప్రీతి రాసిన రిపోర్టును వాట్సాప్ గ్రూప్ లో పెట్టి ఆమెను హేళన చేసినట్టు అంగీకరించాడట. అలాగే ఆమెకు బుర్రలేదని పదే పదే అనేవాడిననీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అదంతా.. ఆమె చావుకి దారితీస్తుందని తెలియలేదని సైఫ్ చెప్పినట్లు సమాచారం. తన కారణంగా ప్రీతి చనిపోయిందన్న పశ్చాత్తాపం సైఫ్ లో కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.
రూ.50 లక్షల బాండ్ ఏంటి ?
వైద్యవృత్తిలో భాగంగా పీజీ చదివే విద్యార్థులు ఫ్రీ సీటు పొందితే.. కళాశాల తరపున రూ.50 లక్షల బాండ్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఏ కారణంగానైనా వాళ్లు చదువుని మధ్యలో వదిలేస్తే.. రూ.50 లక్షలు యాజమాన్యానికి చెల్లించాలి. గతేడాది ఈ ఫైన్ రూ.20 లక్షలుగా ఉండేది. కానీ కొందరు విద్యార్థులు చదువుని మధ్యలో వదిలేసి వెళ్తుండటంతో.. ఆ మొత్తాన్నీ ప్రభుత్వం రూ.50 లక్షలకు పెంచింది. కాలేజీలో తనను ఎంత వేధిస్తున్నా.. ప్రీతి అక్కడ చదువుమానేయకపోవడానికి కారణం ఈ బాండ్ కూడా అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేధింపులు తట్టుకోలేక చదువు మానేస్తే తన తండ్రి కాలేజీకి రూ.50 లక్షలు కట్టాల్సి వస్తుందని, అంత స్తోమత తమకు లేదనుకున్న ప్రీతి.. సైఫ్ ఎంత వేధించినా భరించిందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాలేజీల్లో ర్యాగింగ్ ను రూపుమాపేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story