Tue Dec 24 2024 18:17:53 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారి ముక్కు కోసేసిన వైద్యులు.. ఇదేమిటని ప్రశ్నిస్తే..
పాతబస్తీ కాలాపత్తర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షన్నుస్సా ఖాన్ లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం వారు తిరగని..
ఇన్ఫెక్షన్ పేరుతో వైద్యులు పసికందు ముక్కును తొలగించిన దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. లేక లేక పుట్టిన బిడ్డకు వైద్యులు ముక్కు తొలగించడంపై ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డాక్టర్లు చేసిన పనికి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు. చిన్నారి ముక్కును తొలగించడంపై వైద్యుల్ని, సిబ్బందిని ప్రశ్నిస్తే.. డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో.. శుక్రవారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన నారాయణగూడలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
పాతబస్తీ కాలాపత్తర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షన్నుస్సా ఖాన్ లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం వారు తిరగని ఆసుపత్రంటూ లేదు. ఇన్నాళ్లకు దేవుడు అనుగ్రహించాడో ఏమోగాని.. హర్షన్నుసా గర్భం దాల్చింది. నెలలు నిండటంతో జూన్ 8న హైదర్గూడాలోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో చేరిన ఆమె.. బిడ్డకు జన్మనిచ్చింది. ఫతే ఖాన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే.. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోడానికి ఇబ్బందు పడుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే ఐసీయూకు మార్చారు. అప్పటి నుంచి 10 రోజులు బిడ్డ ఐసీయూలోనే ఉంది. తర్వాత తల్లిదండ్రులకు వైద్యులు బిడ్డను చూపించగా.. బిడ్డ ముక్కు నల్లగా కనిపించింది.
ఇదే విషయమై వైద్యుల్ని ప్రశ్నించగా.. బిడ్డకు ఆక్సిజన్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందని, అందుకే ముక్కు నల్లబడిందని చెప్పి.. మళ్లీ ఐసీయూలో పెట్టారు. మొదటిసారి చూపించినపుడు ఉన్న నల్లటి భాగం.. రెండోసారి చూసినపుడు ఊడిపోయి ఉంది. దాంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఏమైందని అడిగితే.. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. రోజుకు రూ.35వేల చొప్పున బిల్లు కడుతున్నామని, ఇప్పుడు తీరా చూస్తే బాబుకు ముక్కు లేకుండా చేయడం ఏంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story