Mon Dec 23 2024 19:05:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సినిమా స్ఫూర్తితో తండ్రిని చంపించిన కూతురు, సహకరించిన తల్లి
తండ్రి మాట ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ విషయమై తండ్రి - కూతురి మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
తన ప్రేమకు తండ్రి అడ్డొస్తున్నాడని భావించిన కూతురు.. దృశ్యం సినిమా స్ఫూర్తితో తండ్రిని హత్య చేయించి, ఆధారాలు లేకుండా చేసింది. ఈ దారుణానికి అతని భార్యకూడా సహకరించడం గమనార్హం. ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య చేసినా.. పోలీసులు పసిగట్టి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో సెప్టెంబర్ 17న జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
బెళగావి నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళె (57) గతంలో దుబాయ్ లో పనిచేసేవారు. కరోనా సమయంలో దుబాయ్ నుంచి తన సొంత ఇంటికి వచ్చి భార్య రోహిణి, వారి కుమార్తె స్నేహలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె స్నేహ మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసేది. ఆ సమయంలో ఆమెకు అక్షయ్ విఠకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తారా ప్రేమగా మారింది. కూతురి ప్రేమ విషయం తెలిసిన తండ్రి మందలించాడు. అతనికి దూరంగా ఉండాలని చెప్పాడు.
కానీ.. తండ్రి మాట ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ విషయమై తండ్రి - కూతురి మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తన తండ్రి ఉంటే ప్రియుడితో కలిసి ఉండలేమని భావించిన కుమార్తె తండ్రిని హత్య చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమెకూడా అందుకు సహకరిస్తానని చెప్పింది. వెంటనే స్నేహ తన ప్రియుడిని పిలిపించి విషయాన్ని చెప్పింది. హత్య చేసేందుకు ఆధారాలు లేకుండా ఉండేందుకు.. దృశ్యం సినిమాను 10 సార్లు చూశారట. దృశ్యం సినిమా తరహాలో అందరూ ఒకేమాటపై ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న తన తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో ప్రియుడు అక్షయ్ విఠకర్ ను స్నేహ ఇంటికి పిలిపించింది. స్నేహ, ఆమె తల్లి సుధీర్ కాళ్లు, చేతులు బలంగా పట్టుకోగా విఠకర్ కత్తితో పలుసార్లు పొడిచాడు. అనంతరం సుధీర్ మృతిచెందాడని నిర్ధారించుకున్నారు. వెంటనే ప్రియుడు విఠకర్ ను అక్కడి నుంచి పంపించివేశారు.
అనంతరం తన భర్తను ఎవరో హత్య చేశారంటూ రోహిణి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. స్నేహ, రోహిణిల ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు, ఏ విషయంపై అడిగినా తల్లీ, కుమార్తె ఒకే సమాధానం చెప్పటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య, సహకారంతో కుమార్తె, ప్రియుడు కలిసి సుధీర్ ను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
Next Story