Thu Dec 19 2024 12:59:54 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో విషాదం
హైదరాబాద్ నగరంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది
హైదరాబాద్ నగరంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. కారు నడుపుతుండగా గుండెపోటుకు గురైన ఓ డ్రైవర్ తన సీటులోనే తుదిశ్వాస వదిలాడు. ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళుతుండగా డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. చాంద్రాయణగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బడంగ్ పేట్ కు చెందిన జె.ధనుంజయ్ (41) ఓ ప్రైవేటు ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రోజూలాగే శుక్రవారం ఉదయం డ్యూటీకి బయలుదేరిన ధనుంజయ్ ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. పాతబస్తీ లాల్ దర్వాజ ప్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని వెళ్లాడు.నల్లవాగు సమీపంలోకి చేరుకున్న తర్వాత ధనుంజయ్ అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. కారును నియంత్రించలేకపోయాడు. కారు డివైడర్ పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్ పై తలవాల్చేసి కనిపించాడు. ధనుంజయ్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ధనుంజయ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు వల్లే ధనుంజయ్ ప్రాణం పోయిందని వివరించారు. ధనుంజయ్ మరణవార్త కుటుంబంలో ఊహించని విషాదాన్ని నింపింది. ధనుంజయ్ కు భార్య, పదేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నారు.
Next Story