Mon Apr 28 2025 01:57:14 GMT+0000 (Coordinated Universal Time)
పాస్టర్ ప్రవీణ పగడాల మృతిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన హత్య జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. తాము సీసీ టీవీలు పరిశీలించామని, ఆరోపణలు చేసిన వారందరినీ ప్రశ్నించినా వారి వద్ద నుంచి సరైన ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ పగడాల హత్య జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తెలిపారు. పోస్టు మార్టం నివేదికలో కూడా హత్య జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.
బుల్లెట్ పై వస్తూ...
ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బైకుపై వెళుతూ తూర్పు గోదావరి జిల్లాలో మరణించి కనిపించారు. ఈ మృతిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ కేసును ఛేదించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. జరిగిన ఈ ఘటనపై పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ప్రవీణ్ పగడాల కేసులో దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత మృతికి సంబంధించిన గల కారణాలపై అంచనాకు పోలీసు అధికారులు వచ్చినట్లు తెలిసింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
ప్రవీణ్ పగడాల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ హెచ్చరికలు కూడా పోలీసు శాఖ జారీ చేసింది. హత్య అంటూ ఆరోపణలు చేసిన కొందరికి నోటీసులు ఇచ్చి మరీ వారిని విచారించింది. వారి వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తే దాని ఆధారంగా కేసును పరిష్కరిస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఆరోపణలు చేసిన వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్యకు గురి కాలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సీసీ టీవీ పుటేజీలో లభించిన ఆధారాల మేరకు రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నట్లు తెలిపారు.
Next Story