Mon Dec 23 2024 12:54:34 GMT+0000 (Coordinated Universal Time)
తల్లిదండ్రులను వేధిస్తున్నాడని.. అన్నను చంపిన తమ్ముడు !
తల్లిదండ్రులను ప్రతినిత్యం ఇబ్బంది పెడుతున్న అన్నపై పార్థివ్ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తనను హతమార్చాలని..
విజయవాడ : తల్లిదండ్రులను వేధిస్తున్నాడన్న కోపంతో.. సొంత అన్నను తమ్ముడు హతమార్చాడు. ఈ ఘటన వేరే ఏ దేశంలోనో, ఏ రాష్ట్రంలోనే జరగలేదు. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విజయవాడలో జరిగింది. కూరగాయలు కోసే కత్తితో అన్నను దారుణంగా పొడిచి అంతమొందించాడు తమ్ముడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ అయోధ్యనగర్ లోని మారుతి టవర్స్ లో వరప్రసాద్ - ఉమామహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు హర్షత్ బీటెక్ చదువుతుండగా.. చిన్న కొడుకు పార్థివ్ డిస్టెన్స్ లో డిగ్రీ చేస్తున్నాడు. హర్షత్ ప్రతి రోజూ తల్లిదండ్రులతో గొడవ పడటం, వారిని కొట్టడం వంటివి చేసేవాడు.
తల్లిదండ్రులను ప్రతినిత్యం ఇబ్బంది పెడుతున్న అన్నపై పార్థివ్ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తనను హతమార్చాలని గతేడాదే నిర్ణయించుకున్నాడు. హర్షత్ లో మార్పు వస్తుందని ఎదురుచూశాడు. నెలలు గడిచినా.. అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తల్లిదండ్రులతో గొడవ పడుతున్న హర్షత్ పై పార్థివ్ కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీ భాగంతో పొడవడంతో హర్షత్ అక్కడికక్కడే చనిపోయాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు.
Also Read : ఇద్దరితో మహిళ సహజీవనం.. ఓర్చుకోలేక ఆఖరికి ఇలా
అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ జరిగింది ఘర్షణ కాదని, హత్య అని తెలిసింది. పై అధికారులకు సమాచారం ఇచ్చి.. ఘటనా ప్రాంతంలో ఆధారాలను సేకరించారు. తల్లిదండ్రులను వేధిస్తుండడం చూసి తట్టుకోలేక పార్ధివ్ తన అన్న హర్షత్ను హతమార్చినట్లుగా నిర్ధరించారు. హర్షత్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి, పార్థివ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story