Mon Dec 23 2024 13:07:23 GMT+0000 (Coordinated Universal Time)
వరకట్న వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి !
సిరిసిల్లకు చెందిన ఐటీ ఉద్యోగి ఉదయ్ తో నిఖితకు గతేడాది పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నిఖిత తల్లిదండ్రులు
హైదరాబాద్ : ఆడపిల్ల కనబడితే అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడటం.. లేకపోతే.. పెళ్లాడిన భార్యను వేధించడం పరిపాటిగా మారింది. నేరం చేసిన వారికి ఎన్ని శిక్షలు వేసినా.. ఆడపిల్లను బాధించాలనుకుంటున్న వారిలో ఏ చట్టాలు, ఏ శిక్షలూ మార్పు తీసుకురాలేకపోతున్నాయి. తాజాగా వర్నకట్న వేధింపులకు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని బాలకృష్ణ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్లకు చెందిన ఐటీ ఉద్యోగి ఉదయ్ తో నిఖితకు గతేడాది పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నిఖిత తల్లిదండ్రులు రూ.10 లక్షలు నగదు, 35 తులాల బంగారాన్ని ఉదయ్ కు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఉదయ్ అసలు రంగు బయటపడింది. కొన్ని నెలల తర్వాత నిఖితను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఆమె తండ్రి పేరున ఉన్న 4 ఎకరాల భూమిని తనకు ఇవ్వాలని వేధించసాగాడు. ఇటీవల వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో నిఖిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నిఖిత ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. కూతురి మృతదేహాన్ని తీసుకుని సిరిసిల్లకు వెళ్లి.. ఉదయ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కూతురి చావుకు కారణమైన ఉదయ్ ని, అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో సిరిసిల్లలో రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది.
Next Story