Mon Dec 23 2024 10:00:49 GMT+0000 (Coordinated Universal Time)
45 రోజుల్లో కుటుంబం మొత్తాన్ని బలితీసుకున్న అంతుచిక్కని వ్యాధి
కొడుకును పోగొట్టుకున్న శోకం తీరకుండానే.. బిడ్డకు కూడా విరేచనాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా వాంతులు చేసుకుంది.
ఇంట్లో చిన్నపిల్లలుంటే.. వాళ్లు చేసే అల్లరి చూస్తూ.. ఎంత కష్టాన్నైనా ఇట్టే మరిచిపోతారు తల్లిదండ్రులు. కానీ.. ఓ కుటుంబంలో చిన్నారులతో మొదలైన అంతుచిక్కని వ్యాధి.. కుటుంబం మొత్తాన్ని 45 రోజుల వ్యవధిలో బలితీసుకుంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండల కేంద్రంలో జరిగిన ఈ మరణాలు మిస్టరీగా మారాయి. గంగాధరకు చెందిన శ్రీకాంత్, ఆయన భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్.. అంతుచిక్కని వ్యాధితో చనిపోయారు. ఆడుకుంటున్న పిల్లాడికి ఉన్నట్టుండి విరేచనాలు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూనే కన్నుమూశాడు.
కొడుకును పోగొట్టుకున్న శోకం తీరకుండానే.. బిడ్డకు కూడా విరేచనాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా వాంతులు చేసుకుంది. ఆస్పత్రిలో రెండ్రోజుల చికిత్స తర్వాత.. తమ్ముడి వద్దకే వెళ్లిపోయిందా చిన్నారి. వాళ్లని చూసి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకుంది. మరో 10 రోజులకు.. పిల్లల తల్లికి అవే లక్షణాలు కనిపించాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. రెండు రోజులకు తను కూడా కన్నుమూసింది. మరికొద్దిరోజులకు అదే అనారోగ్యంతో.. భార్య, పిల్లల వెంటే వెళ్లిపోయాడు భర్త. ఇలా 45 రోజుల్లో నలుగురు కానరానిలోకాలకు చేరుకున్నారు.
ఈ కుటుంబంలో జరిగిన విషాదం స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. ఇంతవరకూ వారి మరణాలకు అసలు కారణమేంటనేది తెలియరాలేదు. వైద్యులు అందుకు కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాల నుండి సేకరించిన రక్తనమూనాలను పరీక్షించేందుకు హైదరాబాద్ కు పంపించారు. పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story