Mon Dec 23 2024 02:52:33 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం
ప్రయాణికులంతా సత్నాలో జరిగిన కోల్ మహాకుంభ్ ఉత్సవాల్లో పాల్గొని, తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో..
మధ్యప్రదేశ్ లో గతరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో.. ఈ దారుణం జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
రేవా-సత్నా సరిహద్దుల్లోని బర్ఖదా గ్రామ సమీపంలో సిమెంటు లోడుతో వెళ్తున్న ట్రక్కు టైరు పేలిపోయింది. దాంతో వాహనం నియంత్రణ కోల్పోయి.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మూడు బస్సులను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బస్సు పడిపోగా.. మరో బస్సు పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు.
ప్రయాణికులంతా సత్నాలో జరిగిన కోల్ మహాకుంభ్ ఉత్సవాల్లో పాల్గొని, తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో ప్రయాణికులకు ఆహారం అందించేందుకు బస్సులను రోడ్డుపక్కన ఆపి ఉంచిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న మెడికల్ కాలేజీకి వెళ్లి పరామర్శించారు. ఒక్కో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
Next Story