Fri Dec 20 2024 14:05:02 GMT+0000 (Coordinated Universal Time)
కూతురికి మత్తు మందు ఇచ్చి తండ్రి లైంగికదాడి.. కోర్టు కీలక తీర్పు
అతని తుదిశ్వాస వరకూ జైలు జీవితాన్ని అనుభవించాల్సిందేనని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
కూతురికి మత్తు మంది ఇచ్చి తండ్రి లైంగికదాడికి పాల్పడిన కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని తుదిశ్వాస వరకూ జైలు జీవితాన్ని అనుభవించాల్సిందేనని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుటుంబం చాలా ఏళ్ల క్రితం ఫిలింనగర్ కు వచ్చి అక్కడే నివాసం ఉంటోంది. బాధితురాలి తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, తల్లి పలు ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి 14 ఏళ్ల కూతురితో పాటు ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఓ ఆస్పత్రిలో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తె మాత్రం ప్రస్తుతం తన తల్లిదండ్రులతోనే ఉంటోంది.
2021 జులైలో కుమార్తె అనారోగ్యంతో వాంతులు చేసుకోవడంతో.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భిణీ అని తేల్చారు. అసలేం జరిగిందని కూతుర్ని ఆరా తీయగా అసలు విషయం తెలిసి.. గుండెలు పగిలేలా ఏడ్చింది. భార్య పనికి వెళ్లిన తర్వాత కుమార్తె తీసుకునే భోజనంలో తండ్రి నిద్ర మాత్రలు కలిపేవాడు. భోజనం చేసిన తర్వాత ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడేవాడు. స్పృహలోకి వచ్చాక జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భవతి అయింది. విషయం తెలియడంతో నిందితుడు పరారయ్యాడు.
బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును విచారించిన నాంపల్లిలోని 12వ అదనపు ఎంఎస్జే కోర్టు తుదితీర్పు వెలువరించింది. నిందితుడు మరణించే వరకు జైలులోనే ఉంచడంతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే, మెట్రోలీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బాధిత బాలికకు రూ. 7 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story