Sun Dec 22 2024 21:38:45 GMT+0000 (Coordinated Universal Time)
భార్య పై అనుమానంతో.. కొడుకుని చంపేశాడు
ఇంటి బయట ఆడుకుంటున్న కొడుకుని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి షూ లేస్ తో గొంతుకోసి హత్యచేశాడు.
తన భార్యపై ఉన్న అనుమానంతో.. ఆరేళ్ల కొడుకును కడతేర్చాడు ఆ తండ్రి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లా చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజాని గ్రామానికి చెందిన ధర్మేష్ కు భార్య, ఆరేళ్ల కొడుకు రజత్ ఉన్నారు. రోజురోజుకీ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ప్రతిరోజూ గొడవ పడేవాడు.
ఈ క్రమంలో కొడుకు రజత్.. తనకు పుట్టిన కొడుకు కాదనుకున్నాడు. కొడుకు కడతేర్చాలని ప్లాన్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న కొడుకుని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి షూ లేస్ తో గొంతుకోసి హత్యచేశాడు. మృతదేహాన్ని పొలంలోనే వదిలేసి ఏమీ తెలియనట్టు ధర్మేష్ ఇంటికి వెళ్లిపోయాడు. అంతలో.. బయట ఆడుకుంటూ ఉండాల్సిన కొడుకు కనిపించడం లేదంటూ భార్య వెతకడం మొదలుపెట్టింది. ఇరుగుపొరుగు వారు కూడా వెతికినా కనిపించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది.
కొడుకు పై మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజిని చూసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం (జనవరి 6) గ్రామంలోని చెరుకుతోట నుంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో హత్య చేశారని భావించి.. కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. ధర్మేష్ ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. అతడిని తమదైన శైలిలో విచారించారు. తన భార్యపై అనుమానంతోనే కొడుకును హత్య చేసినట్లు ధర్మేష్ నేరాన్ని అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Next Story