Mon Dec 23 2024 12:31:00 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో పరువు హత్య.. కూతుర్ని చంపి సెల్ఫీవీడియో పోస్ట్ చేసిన తండ్రి
హత్యానంతరం ఓ సెల్ఫీవీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కుమార్తెను చంపిన తర్వాత..
విశాఖలో దారుణ ఘటన జరిగింది. విశాఖలోని రెల్లి వీధిలో కన్నతండ్రే కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చాడు. కుమార్తెను చంపిన తర్వాత తండ్రి ప్రసాద్ విశాఖ వన్ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని దారుణంగా చంపేశాడు. కూతురిని చంపుతూ సెల్ఫీ వీడియో తీసిన అతడు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. వరప్రసాద్ కు పెళ్లై ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 13 ఏళ్ల క్రితం భార్య.. తన భర్త, పిల్లల్ని వదిలి వెళ్లిపోయింది. ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ఉన్నత చదువులు చదివించాడు. తన కూతుళ్లని పైస్థాయిలో చూడాలనుకున్నాడు. కానీ.. పెద్దకూతురు కొన్ని నెలల క్రితం ప్రేమవివాహం చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు చిన్నకూతురు కూడా ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలుసుకున్న వరప్రసాద్ మనస్తాపానికి గురయ్యాడు. నిన్ను బాగా చదివించాను, బాగా చూసుకున్నాను, ప్రేమ జోలికి వెళ్లొద్దు అని వరప్రసాద్ తన కూతురికి నచ్చ చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోలేదు.
తండ్రిమాటను పెడచెవిన పెట్టి.. తన ప్రేమాయణం సాగించింది. దాంతో కోపోద్రిక్తుడైన వరప్రసాద్ చిన్న కూతుర్ని కడతేర్చాడు. తన జీవితంలో ఎదురైన పరిస్థితులే ఈ హత్యకు ప్రేరేపించాయి. అయితే.. ఈ హత్య జరిగి రెండ్రోజులైంది. కూతురు నిఖితను హత్య చేసిన వరప్రసాద్.. తన కూతురు అరవింద్ అనే యువకుడితో వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వరప్రసాద్ ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఇంట్లో డెడ్ బాడీ చూసి షాక్ అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు వరప్రసాద్ ను అరెస్ట్ చేశారు.
Next Story