Tue Nov 05 2024 23:15:14 GMT+0000 (Coordinated Universal Time)
కూతురిపై తండ్రి అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష
మద్యంమత్తులో ఇంటికొచ్చిన తండ్రి.. పెద్దకూతురిపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో బాలిక..
నిజామాబాద్ : ఆకతాయిల నుంచి కూతురిని జాగ్రత్తగా కాపాడాల్సిన తండ్రే.. కామంతో కాటేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా .. దారుణానికి ఒడిగట్టాడు. కన్నకూతురిపై అత్యాచారానికి తెగబడిన ఆ కామాంధుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో.. పిల్లల్ని ఇంట్లోనే వదిలి తల్లి శుభకార్యానికి వెళ్లింది. 2018 మే16వ తేదీన మద్యంమత్తులో ఇంటికొచ్చిన తండ్రి.. పెద్దకూతురిపై అత్యాచారం చేశాడు.
ఎవరికైనా చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. కొన్నాళ్లకి గర్భం దాల్చడంతో గర్భస్రావ మాత్రలు వేశాడు. 2019 జూన్ 28న మరోసారి భార్యను కొట్టి కూతురిని తన దగ్గరికి పంపించాలని బెదిరించాడు. భర్త నీచమైన ప్రవర్తనను భరించలేని భార్య రుద్రూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. కన్నకూతురిపై తండ్రి దాష్టీకాన్ని సీరియస్ గా తీసుకున్న న్యాయస్థానం కీచక తండ్రికి కఠిన శిక్ష విధించింది. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే న్యాయసేవా సంస్థ ద్వారా రూ.1.50 లక్షల పరిహారం కోసం బాలిక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Next Story