Fri Nov 22 2024 21:10:41 GMT+0000 (Coordinated Universal Time)
రైల్ ఇంజన్ లో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
మీరట్ : ప్యాసింజర్ రైల్ ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు స్టేషన్ లో ఆగి ఉండటంతో తృటిలో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా దౌరాలా రైల్వే స్టేషన్లో జరిగింది. దౌరాలా స్టేషన్లో ఆగి ఉన్న సహరాన్ పూర్ - ఢిల్లీ ప్యాసింజర్ రైలు ఇంజన్ లో, దాని వెనకున్న రెండు కోచ్ లలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు ఆగి ఉండటంతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజన్ తో పాటు మరో రెండు బోగీలకు వ్యాపించిన మంటలు.. రైలు మొత్తానికి వ్యాపించకుండా ప్రయాణికులే బోగీలను వేరు చేయడం విశేషం.
ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణికులు ఈ సాహసం చేయగా.. దానిని కొందరు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ప్రయాణికుల సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. రైలింజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వైకె ఝా తెలిపారు.
Next Story