Mon Dec 23 2024 09:20:20 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు బోల్తా.. ఐదుగురి దుర్మరణం, 15 మందికి గాయాలు
ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న బస్సును జాలౌన్ జిల్లాలోని గోపాల్ పుర ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో..
ఉత్తరప్రదేశ్ లో బస్సు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న బస్సును జాలౌన్ జిల్లాలోని గోపాల్ పుర ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో.. బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్థారించారు. మృతులు కుల్ దీప్(36), రఘునందన్ (46), శిరోభాన్ (65) కరణ్ సింగ్ (34), వికాస్ (32)లుగా గుర్తించారు. మిగతా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాధోగఢ్ పోలీసులు తెలిపారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు, వైద్యులకు సూచించారు.
Next Story