Fri Nov 22 2024 22:04:01 GMT+0000 (Coordinated Universal Time)
గొంతులో మొక్కజొన్న గింజలు ఇరుక్కుని చిన్నారి మృతి
పెద్ద కుమార్తె బిందుశ్రీ బుధవారం ఇంట్లో మొక్కజొన్నగింజలు తింటుండగా గొంతులో అడ్డం పడ్డాయి. విపరీతంగా దగ్గు..
గొంతులో మొక్కజొన్న గింజలు ఇరుక్కుని మూడేళ్ల పాప ఊపిరి ఆగిపోయింది. ఊపిరితిత్తుల్లోకి గింజలు చేరడంతో చిన్నారి కన్నుమూసింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురంలో జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ.. తన బోసినవ్వులతో అందరినీ నవ్వించే చిన్నారి బిందుశ్రీ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. బిందుశ్రీ మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న బొల్లికొండ వెంకట కృష్ణ, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బిందుశ్రీ బుధవారం ఇంట్లో మొక్కజొన్నగింజలు తింటుండగా గొంతులో అడ్డం పడ్డాయి. విపరీతంగా దగ్గు రావడంతో మూడుసార్లు వాంతులయ్యాయి. చిన్నారి తింటోన్న మొక్కజొన్న గింజలు ఆమె ఊపిరిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస అందక ఇబ్బంది పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పాపను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో పాప ఊపిరితిత్తుల్లో మొక్కజొన్న గింజలను గుర్తించిన వైద్యులు.. పాపకు వెంటనే బ్రాంకోస్కోప్ చేయాలని చెప్పారు. ఆ సదుపాయం ఖమ్మంలో లేకపోవడంతో పాపను వరంగల్ తరలించాలని సూచించారు. అంతలోనే బిందుశ్రీ ఆరోగ్యం క్షీణించి కన్నుమూసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న పాప మరణం.. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.
Next Story