Mon Dec 23 2024 03:50:41 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, గనుల యజమాని దారుణ హత్య
డోన్ నియోజకవర్గంలో అక్రమమైనింగ్ జరుగుతోందని శీను పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు, గనుల యజమానికి అయిన లద్దగిరి శీను అలియాస్ శ్రీనివాసులు(55) దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె వద్ద కాపుకాసి.. బైక్ పై వస్తున్న శీనును కత్తులతో నరికి, కర్రలతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న ప్యాపిలి సీఐ, జలదుర్గం ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు. శీను కొంతకాలంగా మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఎవరి నుండో బెదిరింపులు వచ్చాయని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. శీను హత్యపై పలువురు మైనింగ్ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. హత్యకు ఉపయోగించిన వస్తువులను నిందితులు అక్కడే వదిలి వెళ్లారు.
జలదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డోన్ నియోజకవర్గంలో అక్రమమైనింగ్ జరుగుతోందని శీను పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ప్రత్యర్థులే అతడిని హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. తన తండ్రికి ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని మృతుని కుమారుడు మధు ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి.. ప్రాణహాని ఉందన్నారు కానీ.. ఎవరివల్ల ఉందనేది చెప్పలేదన్నారు. లద్దగిరి శీను కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, నియోజకవర్గ టిడిపి బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
Next Story