Mon Dec 23 2024 17:00:44 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియురాలి ప్రేమ కోసం.. స్నేహితుడినే హత్య చేసిన యువకుడు
రాజ్ కపిల్ తో చనువుగా ఉండటంతోనే తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్న రాహుల్ సింగ్ తన స్నేహితుడైన రాజ్ కపిల్ ను..
తాను ప్రేమిస్తున్న యువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకొలేక సదరు యువకుడిని అతిదారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ కొత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన రాజ్ కపిల్ సాహు (20) అనే యువకుడు కొత్తూరు లోని హెచ్ ఐఎల్ వాచ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా రాజ్ కపిల్ స్నేహితుడైన రాహుల్ సింగ్(21) ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే ఆయువతిని రాజ్ కపిల్ సాహు సైతం ప్రేమిస్తు న్నాడు. ఈ విషయం రాహుల్ సింగ్ కు తెలిసింది. ఇదిలా ఉండగా రాహుల్ ఆ యువతిని పెళ్లిచేసుకుందామని అడుగగా అందుకు యువతి నిరాకరించింది.
రాజ్ కపిల్ తో చనువుగా ఉండటంతోనే తనతో పెళ్లికి నిరాకరించిందని కోపం పెంచుకున్న రాహుల్ సింగ్ తన స్నేహితుడైన రాజ్ కపిల్ ను ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. పథకంలో భాగంగా రాహుల్ సింగ్ తన స్నేహితుడైన కపిల్ తాహెర్(19), మరో ఇద్దరు మైనర్ బాలురు కలిసి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జనసాయి వెంచర్ కు వెళ్లారు. ముందుగా అనుకున్నట్లుగా అందరూ కలిసి మద్యం సేవించారు. ఆపై నలుగురు కలిసి రాజ్ కపిల్ పై పగిలిన సీసాలతో దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రాజ్ కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రాజ్ కపిల్ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన అతని మరో స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు ను పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేవలం 24 గంటల్లో కేసును చేధించిన పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
Next Story