Mon Dec 23 2024 18:32:15 GMT+0000 (Coordinated Universal Time)
సినీ ఫక్కీలో.. తెలంగాణలో యువతిని కిడ్నాప్ చేసిన 100 మంది
తమ కుమార్తె ముచ్చెర్ల వైశాలిను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ ఉమామహేశ్వరరావు..
సినీ ఫక్కీలో.. ఓ వందమంది కలిసి యువతిని కిడ్నాప్ చేసిన ఉదంతం తెలంగాణలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ మునిసిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. 100మంది కలిసి ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, గ్రామస్తులు అడ్డుపడగా.. వారిని కొట్టి మరీ కిడ్నాప్ చేశారు. యువతి ఇంటిలో విధ్వంసం సృష్టించారు. వస్తువులను పగులగొట్టి, కార్లను ధ్వంసం చేశారు.
తమ కుమార్తె ముచ్చెర్ల వైశాలిను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాప్ చేసింది మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో నవీన్ రెడ్డి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. కిడ్నాపైన యువతి డాక్టర్ చదువుతుండగా..నవీన్ రెడ్డి యువతిని ప్రేమించాడు.
ఈ విషయం తెలిసి.. వైశాలి తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లిపనులు కూడా మొదలయ్యాయి. పెళ్లికొచ్చిన అతిథులతో.. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఈ క్రమంలో నవీన్ రెడ్డి సినిమా స్టైల్లో 100 మంది గ్యాంగ్ తో వైశాలి ఇంటికి వచ్చాడు. వైశాలిని తీసుకెళ్లటానికి యత్నిస్తుండగా ఇంట్లో ఉన్న బంధువులు, తల్లిదండ్రులు వారిని అడ్డుకున్నారు. దీంతో సదరు గ్యాంగ్ వారిపై దాడి చేశారు. ఇంట్లో వస్తువుల్ని..ఇంటి బయట ఉన్న కారుని ధ్వంసం చేశారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తు వైశాలిని ఎత్తుకుపోయారు.
ఇక్కడే అసలు కొసమెరుపు. వైశాలి తనకిష్టమయ్యే వెళ్లిందా లేక బలవంతంగా తీసుకెళ్లారా అన్న విషయం తెలియరాలేదు. ఆమె ఆచూకీ కోసం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వైశాలి అన్న ఆ పేరు, ప్రేమ, కిడ్నాప్ చూస్తుంటే.. అచ్చం దేశముదురు సినిమాలో జరిగినట్టే ఉంది కదూ. మరి ఈ రియల్ కిడ్నాప్ లో క్లైమాక్స్ ఏమవుతుందో చూడాలి.
Next Story