Fri Dec 20 2024 08:16:15 GMT+0000 (Coordinated Universal Time)
Lawrence Bishnoi : జైలు నుంచే గ్యాంగ్‌స్టర్ హత్యలు.. పోలీసులు ఏం చేస్తున్నట్లో?
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే దేశంలో హత్యలు తన టీంతో హత్యలు చేయిస్తున్నాడు.
ఒక గ్యాంగ్‌స్టర్ జైలు నుంచే తన టీంతో హత్యలు చేయిస్తున్నాడు. దాదాపు ఏడువందల మంది షార్ప్ షూటర్లు అతని బృందంలో ఉన్నారు. అతనే లారెన్స్ బిష్ణోయ్. ఈ శక్తి లేకుండా ఈ గ్యాంగ్‌స్టర్ తన హత్యాకాండను కొనసాగిస్తున్నాడా? బిష్ణోయ్ వెనక ఉన్నది ఎవరు? దాదాపు ఏడు మంది పెయిడ్ షూటర్లకు నెల నెల జీతాలు చెల్లించడమంటే మామూలు విషయం కాదు. వీరిని పెంచి పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ఆగడాలను ప్రభుత్వాలు అరికట్టలేరా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. జైలులోనే తాను ఉండి దేశంలో పలు చోట్ల హత్యలు చేస్తున్నాడంటే ఎంతకు తెగించాడో ఇట్టే అర్థమవుతుంది. అతని ధైర్యం వెనక ఉన్నది ఎవరన్న దానిపై పోలీసులు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
స్కెచ్ వేసిందటే...?
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్కెచ్ వేసిందంటే అవతలి వాళ్లు హతమవ్వాల్సిందే. పక్కా ప్లాన్ తో హత్యలు చేస్తారు. ముందుగా రెక్కీని నిర్వహించి తర్వాత అదను చూసి మాటు వేసి మరీ మట్టుబెడతారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేయడంతో మరోసారి దేశంలో అతగాడి పేరు మారుమోగిపోతుంది. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు. అతని సోదరుడు మాత్రం కెనడాలో తిష్ట వేసి ఈ గ్యాంగ్ ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశాడు. హత్య చేసి తమ గ్యాంగ్ అని బహిరంగంగా ప్రకటించుకునే ఈ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్న నేరగాడ్ని ఏమీ చేయలేరా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అతని ఆగడాలను అరికట్టాలంటే ముందుగా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి. తర్వాత గ్యాంగ్ మొత్తాన్ని గుర్తించి వారిని లోపల పడేయాలి.
సంపన్న కుటుంబంలో జన్మించి...
లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామానికి చెందిన సంపన్న కుటుంబంలో పుట్టాడు. లారెన్స్ 1993లో పుట్టాడు. బిష్ణోయ్ పంజాబ్ యూనివర్సిటీలో లా కోర్సు పూర్తి చేశాడు. ఆ సమయంలో స్టూడెంట్ లీడర్ గా ఉన్నాడు. ఆ సమయంలో గోల్డీ బ్రార్ తో ఏర్పడిన పరిచయాలు గ్యాంగ్ స్టర్ గా మార్చాయి. గ్యాంగ్ వార్ ను మొదలు పెట్టాడు. ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో లారెన్స్ బిష్ణోయ్‌కు చెందిన గ్యాంగ్ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. 2018లో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేయడంతో లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఇతని నెట్ వర్క్ మొత్తం పదకొండు రాష్టాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటికీ అతని గ్యాంగ్ మాత్రం దేశంలో చురుగ్గా పనిచేస్తుంది.
హత్యలు చేయడంలో...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే అనేక మందిని హత్య చేశారు. తన సన్నిహితుడు జస్విందర్ ను గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేయడంతో మరింత రెచ్చిపోతున్నాడు. పంజాబ్ లో సిద్దూ మూసేవాలా హత్యకు రెండు ముఠాల మధ్య పోరే కారణమని పోలీసులే అంగీకరిస్తున్నారు. విక్కీ మిధుఖేడా మృతికి ప్రతీకారంగా సిద్ధూ మూసేవాలను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపేశారు. ఇక ఆర్థికంగా బలపడేందుకు ఇతని గ్యాంగ్ డ్రగ్స్ రవాణా చేస్తుంది. జైల్లు ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ సకలసౌకర్యాలు లభిస్తున్నాయంటున్నారు. ఫోన్ ద్వారానే తన అనుచరులకు సూచలు ఇస్తారంటున్నారు. బిజినెస్మెన్లతో పాటు స్టార్ హీరోలను టార్గెట్ చేసి వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తాడన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నేతలు కూడా లారెన్స్ బిష్ణోయ్ బాధితులున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ ఆగడాలను మాత్రం కొన్నేళ్ల నుంచి పోలీసులు అరికట్టలేకపోతున్నారంటే మన బలహీనత అనుకోవాలా? లారెన్స్ బిష్ణోయ్ బలం అనుకోవాలో మీరే నిర్ణయించుకోండి.
Next Story